మున్సిపాలిటీల అప్పులూ ఎక్కువే

దేశంలో ఒడిశా ఫస్ట్, తెలంగాణ సెకండ్..ఆర్బీఐ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అప్పులను రూ.7 లక్షల కోట్లకు పైగా పెంచిన గత బీఆర్ఎస్​ప్రభుత్వం.. మున్సిపాలిటీల కోసం అదే రీతిన అప్పులు చేసింది. దేశంలో మున్సిపాలిటీలకు ఎక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో ఒడిశా​మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా రిలీజ్ చేసిన 2023–24 రిపోర్టులో వెల్లడైంది. దేశంలోని 232 మున్సిపాలిటీలకు సంబంధించి 2019–20 నుంచి 2023–24 వరకు ఉన్న ఆదాయం, ఖర్చు, రుణాలు, మార్కెట్ బాండ్లు.. ఇలా అనేక అంశాలపై ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందులో 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాల్లో వచ్చిన రాబడి ఆధారంగా ఈ నివేదికను ఆర్బీఐ తయారు చేసింది.

దేశంలో మున్సిపాలిటీల తలసరి ఆదాయంలో తెలంగాణ మున్సిపాలిటీల అప్పుల వాటా 14.4 శాతంగా, ఒడిశా వాటా 15.1 శాతంగా ఉందని వెల్లడించింది. ఇదిలా ఉంటే  సొంత పన్నుల రాబడిలో దక్షిణాది రాష్ట్రాల పనితీరు బాగున్నట్టు ఆర్బీఐ చెప్పింది. తెలంగాణలో సొంత పన్నుల రాబడి భారీగా పెరిగినట్టు చెప్పింది. మున్సిపాలిటీలకు వచ్చే ప్రతి రూ.లక్ష రాబడిలో సొంత పన్నుల వాటా 50 శాతంగా ఉందని తెలిపింది. సొంత పన్నులు ఎక్కువగా వస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్-2లో నిలిచినట్టు వెల్లడించింది. అదే విధంగా దేశంలోని మున్సిపాలిటీల ఆదాయ వనరులు మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడింది. అర్బన్ స్థానిక సంస్థలకు ఆదాయం వస్తున్నా, ఇంకా కేంద్ర గ్రాంట్లపైనే ఆధారపడాల్సి వస్తోందని చెప్పింది. ఇప్పుడున్న ఆదాయ వనరులు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి సరిపోవని, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.